దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాద శక్తులు పెరిగాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహా సభలను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద ప్రచారానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.
భూమి ఉన్నంత కాలం కార్మికులకు, రైతులకు ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో మోడీ, అమిత్ షా డబుల్ ఇంజన్ లా దూసుకుపోతామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, కామ్రేడ్లు ఐక్యం కావాలన్నారు.
కార్మికులను దోచుకుంటూ కార్పొరేట్ వ్యవస్థలకు వత్తాసు పలుకుతూ, కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్న బీజేపీకి భవిష్యత్తులో భంగం తప్పదని, ప్రజలు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన గడ్డపై మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. అలాంటి మహానేతను మనం ప్రతీ రోజు స్మరించుకోవాలన్నారు. ఈ సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాతీయ నాయకులు బీ వెంకట్, రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.