మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా కేరళ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. బస్టాప్ లో అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చుని నిరసన తెలియజేశారు.
అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. నిముషాల్లోనే అది తెగ వైరల్ అయింది. దీంతో అది అధికారుల దృష్టికి వెళ్ళింది. అధికారులు రంగంలోకి దిగి స్థానిక కాలనీ వాసులతో మాట్లాడి విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. తిరువనంతపురంలో ఓ ఇంజినీరింగ్ కళాశాలకు దగ్గర ఓ బస్టాప్ ఉంది. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఆ బస్టాప్ లో పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అంతా కలిసి ఒకరితో ఒకరు ఫన్ చేయడం లాంటివి చేస్తుంటారు.
ఈ దృశ్యాలను చూసి కాలనీ వాసులు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. ఈ క్రమంలో చాలా సార్లు ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. కానీ విద్యార్థులు మాత్రం బస్టాప్ లో అలాగే ఒకరి పక్కనే ఒకరు కూర్చుండి కబుర్లు చెప్పుకునే వారు.
ఈ క్రమంలో దీనికి ఎలాగైనా ముగింపు పలకాలని కాలనీ వాసులు అనుకున్నారు. వెంటనే బస్టాప్ లో ఉండే బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చారు. అమ్మాయిలు అబ్బాయిలు బస్టాప్ లో పక్క పక్కనే కూర్చోకూడదనే ఉద్దేశంతోనే కాలనీ వాసులు అలా చేశారు.
కాలనీ వాసుల తీరుపై ఆవేదన చెందిన విద్యార్థులు తమ నిరసనను తెలపాలనుకున్నారు. వెంటనే ఒక్కో కుర్చీలో అబ్బాయిలపై అమ్మాయిలు కూర్చుని ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాలనీ వాసుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రగతి శీల సమాజంలో ఉన్నామని అంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు పక్కపక్కనే కూర్చోవడంపై ఎలాంటి నిషేధం లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా అలాగే భావిస్తే వారు ఇంకా ఎడ్లబండ్ల కాలంలోనే ఉన్నట్టుగా వారిని పరిగణించాలని చెబుతున్నారు.