కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలో రెండు నోరో వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది.
ఆరోగ్య శాఖ అధికారులను అలర్ట్ చేసినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేసుల నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్టు ఆమె పేర్కొన్నారు.
నోరో వైరస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు.
ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ పరిశుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.