ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 26..గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించాలని కేరళ కాంగ్రెస్ మైనారిటీ విభాగం నిర్ణయించింది. ఈ డాక్యుమెంటరీ ని కేంద్రం నిషేధించడాన్ని తప్పు పట్టింది. కేంద్ర నిర్ణయానికి నిరసనగా దీన్ని ఆ రోజున ప్రదర్శిస్తాం.. ఈ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధం అని ఈ విభాగానికి చెందిన లాయర్ షహిబుద్దీన్ ఆరోపించారు.
ప్రజలు దీన్ని తప్పనిసరిగా చూడాలని, కేంద్రం విధించిన నిషేధాన్ని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. 2002 లో గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్లను హైలైట్ చేస్తూ బీబీసీ ఈ డాక్యుమెంటరీని రెండు భాగాలుగా రూపొందించింది. అయితే ఇది వివాదాస్పదంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఇండియాలో దీన్ని బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కానీ దేశంలోని పలు యూనివర్సిటీలు ఈ బ్యాన్ ని పట్టించుకోకుండా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలన్న అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇందుకు ఈ నెల 26 వ తేదీ రిపబ్లిక్ డే ను కేరళ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఎంచుకుంది. పైగా హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తమ క్యాంపస్ లో దీన్ని ప్రదర్శించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏబీవీపీ కార్యకర్తలు , ఈ సంస్థకు చెందిన విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.