సామాన్యంగా మనం ఓ ప్రధాని, సీఎం, గవర్నర్… రోడ్డు మీద వెళ్తుంటే పాదచారులను, వాహనదారులను ఆపివేయడం చూస్తూంటాం. కానీ ఇక్కడ ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి ఏకంగా రోడ్డునే బ్లాక్ చేసి తన ఉదయపు నడకను కొనసాగిస్తున్న తీరు కేరళలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం…
కేరళలోని కొచ్చిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్, వినోద్ పిళ్లై కొచ్చిలోని క్వీన్స్ వాక్ వేలో ఉదయం పూట నడక సాగిస్తుంటారు. దీని కోసం అత్యుత్సాహంతో ట్రాఫిక్ సిబ్బంది ఆ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసేస్తున్నారు. అయితే క్వీన్స్ వాక్ వేలో పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం కేవలం ఆదివారం మాత్రమే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఒక భాగం రోడ్డును మూసివేస్తారు.
అయితే మన అధికారి వినోద్ పిళ్లై మార్నింగ్ వాక్ కోసం ఇటీవల ప్రతిరోజూ దీన్ని బ్లాక్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ ను కూడా మరోవైపునకు మళ్లీస్తున్నారు. దీంతో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లే పిల్లలు, వారిని బస్సుల్లో ఎక్కించే తల్లిదండ్రులతో పాటు ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారికి దీనిపై నోటీసులు జారీ చేశారు.
కాగా, గత నెలలో ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి తన భార్య, పెంపుడు కుక్కతో ఈవినింగ్ వాక్ కోసం వస్తుండటంతో.. స్టేడియంలోని క్రీడాకారులను, శిక్షకులను ముందుగానే బయటకు పంపేస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్‌ను లడఖ్ కు, ఆయన భార్య ఐఏఎస్ అధికారిణి రింకు దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ కు బదిలీ చేశారు.