కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి బబియా మరణించింది. ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం కోనేరులోని పైకి తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో వారు బబియాని పైకి తీసుకువచ్చి చూడగా మరణించినట్లు ధృవీకరించారని ఆలయ అధికారులు వెల్లడించారు.
కాగా బబియా చివరి చూపు కోసం వందలాది మంది భక్తులు, పలువురు నాయకులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో బబియా మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం గుడి పరిసరాల్లో ఉంచారు. సోమవారం మొసలి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర అనే గ్రామంలో ఉన్న పవిత్ర అనంత పద్మనాభ స్వామి ఆలయం కోనేరు మధ్యలో ఉంటుంది. ఈ సరస్సులో మొసలి బబియా దశాబ్ధాల పాటు నివసించింది. ఇది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం అన్నం మాత్రమే తిని జీవించేది. మొసలి బబియా శాఖాహారం, ఆలయంలోని ప్రసాదాన్ని ఇష్టంగా తినేది.
70 సంవత్సరాలకు పైగా ఈ మొసలి ఆలయ సరస్సులో జీవించిందని అధికారులు వెల్లడించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అలాగే దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదని స్థానికులు చెబుతున్నారు. అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని.. ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినేది కాదని ఆలయ పూజారి వెల్లడించారు.
ఆలయ పూజారికి, మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రోజూ పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నం పెట్టేవారని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందించేవారని చెబుతున్నారు. ఆలయాన్ని రక్షించేందుకు దేవుడు నియమించిన సంరక్షకురాలు ఈ మొసలి అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చిన వారంతా బబియా ఫోటోలను తీసుకుంటూ సంతోషపడుతుంటారు. ప్రస్తుతం బబియాకు నివాళులర్పించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.