చైనాలో కరోనా వైరస్ మృతులు 900 దాటి….ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోని మొట్టమొదట కేరళలో నమోదైన కరోనా వైరస్ పేషెంట్ కు తాజా పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. చైనాలో కరోనా వైరస్ కు కేంద్ర బింధువైన వుహాన్ నగరంలో కేరళకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారు. వైరస్ నేపధ్యంలో వుహాన్ లో చదువుతున్న కేరళ విద్యార్ధులందరిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చారు. అలా వచ్చిన ముగ్గురు విద్యార్ధులకు వైరస్ సోకినట్టు గుర్తించారు. వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారిలో మొదట వైరస్ ను గుర్తించిన ఒక విద్యార్ధికి చికిత్స అనంతరం జనవరిలో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ మళ్లీ కొన్ని రోజులు అబ్జర్వేషనలో ఉంచుతూ చికిత్స చేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ పేషెంట్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని త్రిసూర్ మెడికల్ కాలేజీ అధికారులు తెలిపారు.
అయితే దీనిని అధికారికంగా వెల్లడించడానికి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు నిరాకరించాయి. మరోసారి శాంపిల్స్ ను పుణెలోని ల్యాబరేటరీకి పంపి నెగిటివ్ అని తేలాక మీడియాకు వెల్లడించనున్నట్టు తెలిపింది. వైరస్ సోకిన మిగతా ఇద్దరు విద్యార్ధులు అలప్పుజ, కాసర్ గోడ్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 3000 మంది అనుమానితులను అబ్జర్వేషన్ లో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మందికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.