కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేశ్ ప్రధాని మోడీ లేఖ రాశారు. సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐతో విచారణ జరిపించాలని లేఖలో ఆమె కోరారు.
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందని, అందువల్లే ఈ కేసును కస్టమ్స్, ఎన్ఐఏకు అప్పగించారని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆ రెండు ఏజెన్సీలు ఈ కేసును తప్పు తోవ పట్టిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో తాను మెజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. ఇక అప్పటి నుంచి తనతో పాటు తన బంధవులను తీవ్ర వేధింపులకు వారు గురి చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
ఈ కేసులో తనను కేరళ ప్రభుత్వం ఇరికించిందన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థప్రయోజనాల కోసం తనను బలిపశువును చేశారని ఆమె వాపోయారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా కలిసి తన పరిస్థితిని ఆయనకు వివరించాలని అనుకుంటున్నట్టు లేఖలో తెలిపారు.