పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు నాశ్రయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో సవాల్ చేసే ముందు గవర్నర్ ను కలిసి అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాద పాటించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రోటోకాల్ ను ధిక్కరించడమేనని పేర్కొన్నారు. వాళ్లు చేసింది తప్పని తాను అనడం లేదని…సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు వాళ్లకుందని తెలిపారు. అయితే ముందుగా నా అనుమతి తీసుకోవడం కనీస మర్యాద అన్నారు.గవర్నర్ అనుమతి లేకుండా పార్లమెంట్ చేసిన చట్టంపై సుప్రీంకోర్టు వెళ్లడం ఎంత వరకు సబబో తాను చెక్ చేస్తానని చెప్పారు. ఒక రాష్ట్ర రాజ్యంగ పరిరక్షకుడినైన తనకే ఈ విషయం న్యూస్ పేపర్లలో వచ్చేంత వరకు తెలియదన్నారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని..రాజ్యాంగంలోని పలు అధికరణలను చట్టం ఉల్లంఘించిందని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. చట్టం రాజ్యాంగ మౌళిక సూత్రాలైన సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని పిటిషన్ లో పేర్కొంది.