కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. ఎన్నో రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అయితే, వైరస్ వల్ల చినపోకుండా ఉండేందుకు చేపట్టిన లాక్ డౌన్ కారణంగా మందుబాబులు మరణిస్తుండటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం సర్కార్ చర్యలు చేపడుతుంది. దినసరి కూలీలు సహా ఎంతో మంది వేతన జీవులు ఇబ్బంది పడుతున్నారు. కానీ వారందరిది ఒక ఎత్తు అయితే… లాక్ డౌన్ కారణంగా వైన్స్ షాపులు బందైపోవటంతో మందుబాబులు అనారోగ్యం బారిన పడుతూ మరణిస్తున్నారు. ఆకస్మాత్తుగా మద్యం తాగటం ఆపేయటంతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కేరళలో మందులేక చనిపోయిన వారి సంఖ్య రెండంకెలకు చేరగా, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మద్యం చావులు, కేసులు నమోదవుతున్నాయి.
అయితే, కేరళలో మద్యం కారణంగా మరణిస్తుండటంతో అక్కడి సర్కారు కొన్ని నివారణ చర్యలు చేపట్టింది. ఉన్న ఫలంగా మద్యం మానేయటంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా… డాక్టర్ల సూచన మేరకు వారికి తగు మోతాదులో మద్యం సరఫరా చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. తద్వారా ఈ మద్యం చావులను అరికట్టాలని యోచిస్తుంది.
అయితే, దీనిపై డాక్టర్ల సంఘాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. మద్యం ఒక్కసారిగా మానేస్తే… శరీరంలో వణుకుతో పాటు కొన్ని ఇబ్బందులు వస్తాయని, కానీ వాటికి పరిష్కారాలు వేరే ఉన్నప్పటికీ మద్యం సరఫరా చేయాలనటం, అందుకోసం డాక్టర్ల అనుమతి తీసుకోవాలనటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నాయి.