కేరళలో జరిగిన నరబలి కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇంటరాగేషన్ సందర్భంగా నిందితులు చెబుతున్నవి విని పోలీసులు షాక్ తిన్నారు. ఈ కేసులో నిందితులైన భగ్వల్ సింగ్, అతని భార్య లైలా, తాము ఇద్దరు మహిళలను హతమార్చిన అనంతరం వారి శరీర భాగాలను వండి మాంసం తిన్నామని తెలిపారు. కేరళలోని పతనమిత్త జిల్లా ఎలంథూర్ లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
సాంప్రదాయక మ్యాసేజ్ థెరపిస్ట్ అయిన భగ్వల్ సింగ్ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. లోగడ ఈయన సీపీఎం బ్రాంచ్ కార్యదర్శి అని, ప్రస్తుతం ఎలంథూర్ సీపీఎం కమిటీ లోకల్ సభ్యుడని పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళలను గొంతుకోసి వారి శరీర భాగాలను ముక్కలు చేశామని, ఆ తరువాత ఈ జిల్లాలోని తమ ఇంటి సమీపంలో ఖననం చేశామని సింగ్ దంపతులు ఒప్పుకున్నారు.
తమ కుటుంబం ఆర్థికంగా బాగుపడడానికే ఇలా చేశామన్నారు. ఈ కేసులో వీరి ఏజంట్ మహమ్మద్ షఫీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హతులైన ఇద్దరు మహిళలకు మాయ మాటలు చెప్పి ఇతడు వారిని భగ్వల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చినట్టు తెలిసింది.
ఈ కేసులో వీరి చేతిలో దారుణంగా హత్యకు గురైన మహిళలు పద్మం, రోజిలీ ఇద్దరూ లాటరీ టికెట్లు అమ్ముకుని జీవించేవారని తెలుస్తోంది. భగ్వల్ సింగ్, అతని భార్య లైలాను, షఫీని పోలీసులు బుధవారం ఎర్నాకుళం సెషన్స్ కోర్టులో హాజరు పరచగా ఈ ముగ్గురినీ ఈ నెల 26 వరకు జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.