దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నరబలి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకడైన భగ్వల్ సింగ్ ఒకప్పుడు ‘కవి’ అట ! ‘హైకూ’ పద్యాలు రాసి వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేవాడట. ఇతని ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తే ఇందులో చాలా యాక్టివ్ గా ఉండేవాడని, తరచూ జపనీస్ తరహా పొయెట్రీ..’హైకూ’ ని రాసేవాడని తెలిసింది.
ఇవి సుమారు 17 ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 6 న కూడా ఇతగాడు ఫేస్ బుక్ లో ఇలాంటి పద్యాలు రెండు పోస్ట్ చేశాడని వారు చెప్పారు. నరబలి కేసులో ఇతని భార్య లైలా, వీరి ఏజెంట్ షఫీ అరెస్టయ్యారు.
భగ్వల్ సింగ్ ఇలా ‘కవి’ గా కూడా పద్యాలు రాశాడంటే పోలీసులు నమ్మలేకపొతున్నారు. ఇక ఏజెంట్ షఫీ.. సోషల్ మీడియాలో తనను యువతిగా ప్రచారం చేసుకున్నాడట. ‘శ్రీదేవి’ పేరిట ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన ‘డీపీ’లో కొన్ని పువ్వుల ఫోటోలు సైతం పెట్టి అలా చలామణి అయ్యాడని పోలీసులు చెప్పారు.
పైగా తనను పవిత్రుడైన బాబాగాను, పూజలు చేసి ధనవంతులను చేస్తానని చెప్పుకుంటూ భగ్వల్ సింగ్ కి దగ్గరయ్యాడని వారు తెలిపారు. ఇతడ్ని భగ్వల్ సింగ్ దంపతులు గుడ్డిగా నమ్మారు. లైలాతో కూడా షఫీకి వివాహేతర సంబంధం ఉన్నట్టు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురి చేతిలో హతులైన ఇద్దరు మహిళల్లో ఒకరి పట్ల వీరు అత్యంత అమానుషంగా వ్యవహరించారని ఖాకీలు పేర్కొన్నారు.