తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయా…? మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒకరిద్దరు మంత్రులను సీఎం సాగనంపబోతున్నారా…? ఖమ్మం జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి ఐటీ మంత్రిగా రాబోతున్నాడా…? అంటే అవుననే తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మంత్రుల పనితీరుకు ముడిపెట్టిన సీఎం కేసీఆర్… చెప్పినట్లుగానే మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించబోతున్నారు. ఒకరిద్దరు మంత్రులను సాగనంపి… వారి స్థానంలో కొత్తవారికి చాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఐటీ మంత్రిత్వ శాఖను ఐపీఎస్ అధికారి లక్ష్మణ్‌కు ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియా కథనం ప్రచురించింది. కేరళ క్యాడర్‌లో ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఐజీ లక్ష్మణ్ మంత్రి పదవి చేపట్టబోతున్నట్లు ఆ కథనం సారాంశం.
1997 బ్యాచ్‌కు చెందిన లక్ష్మణ్… మాజీ డీజీపీ డి.టి నాయక్ అల్లుడు. కేరళలో పనిచేస్తున్నప్పటికీ, సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అందుకే 2009, 2014, 2019 ఎన్నికల్లో టీఆరెఎస్ టికెట్‌పై పోటీ చేయాలని కోరినా నిరాకరించానని, కానీ ఇప్పుడు మంత్రివర్గంలో చేరబోతున్నానని మనోరమ పత్రికకు లక్ష్మణ్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. మరో 14 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తన పదవికి రాజీనామా చేయబోతున్నానని, ఇప్పటికే కేరళ డీజీపికి సమాచారం అందించినట్లు లక్ష్మణ్ దృవీకరించారు.
ఇదే విషయంపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. అయితే, లక్ష్మణ్ ఎంట్రీపై సమచారం అటుంచితే… పదవి పోగుట్టుకునే మంత్రులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.