కేరళలోని కన్నూరుకు చెందిన పొరున్నన్ రాజన్ ఓ దినసరి కూలీ. 52 ఏళ్ల రాజన్ కు భార్య ముగ్గురు పిల్లలు. రోజు వారీ కూలీతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. పెద్ద కూతురు పెళ్లికి తీసుకొచ్చిన అప్పు తీర లేదు. ఇల్లు కడదామని మొదలు పెడితే అది ముందుకు సాగక గత కొన్నేళ్లుగా అలాగే ఉంది. మొత్తం ఏడు లక్షలు అప్పు చేశాడు. పిల్లలను చదివించడం కష్టంగా మారింది. ఎప్పుడూ లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. అతను లాటరీ టిక్కెట్లకు డబ్బులు తగలెయ్యడం ఆయన భార్యకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. తరచుగా ఆమె తిడుతూనే ఉంటుంది. అయినా లాటరీలపై ఆయనకు నమ్మకం సడల లేదు. ఏదో ఒక రోజు అదృష్టం తన ఇంటి తలుపు తట్టకపోతుందా..? అనే విశ్వాసంతో జీవించేవాడు. ఓ రోజు లోన్ కోసం బ్యాంక్ కు వెళ్తుండగా దారిలో క్రిస్ మస్-న్యూ ఇయర్ బంపర్ లాటరీ టికెట్లు కనిపంచాయి. రూ.300 పెట్టి ఆ టిక్కెట్ కొన్నాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. క్రిస్ మస్ -న్యూ ఇయర్ బంపర్ లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్ల ల్యాటరీ తగిలింది.
మొత్తం రూ.12 కోట్ల రూపాయల్లో ట్యాక్స్ లు, ఏజెన్సీ కమిషన్ లు పోగా…రూ.7.2 కోట్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన డబ్బులతో తనకున్న అప్పులను తీర్చడంతో పాటు ఇల్లు కట్టుకుంటానని..తన చిన్న బిడ్డను మంచిగా చదివించుకుంటానని చెప్పారు రాజన్. అంతే కాదు…కొంత డబ్బును పేదలకు సహాయం చేస్తానని చెప్పాడు.
క్రిస్ మస్-న్యూఇయర్ బంపర్ లాటరీలో రెండో బహుమతి రూ. 5 కోట్లు. దాన్ని 10 మందికి సమానంగా ఇస్తారు. మూడో బహుమతిగా కోటి రూపాయలను 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తారు.