ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఇళ్ళ కే పరిమితం చేసింది కరోనా వైరస్. కానీ ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు కొందరు ప్రతిభావంతులు. ఆ ఖాళీ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు.
బ్రిటన్ లో స్థిరపడ్డ కేరళకు చెందిన ఓ వ్యక్తి ఖాళీగా ఉండలేక విమానాన్నే తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా దానిలో కుటుంబంతో కలిసి యూరప్ మొత్తం ఓ ట్రిప్ వేశాడు. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలపుళకు చెందిన అశోక్ అళిసెరిల్ థామ్ రక్షణ్ అనే వ్యక్తి బ్రిటన్ లో స్థిరపడ్డాడు. ఈయన మరెవరో కాదు… మాజీ ఎమ్మెల్యే ఈవీ థామ్ రక్షణ్ కుమారుడే. 2006 లో చదువు నిమిత్తం లండన్ వెళ్లిన అశోక్ చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. ప్రస్తుతం ఆయన ఫోర్డ్ కంపెనీలో పని చేస్తున్నారు.
అశోక్ గతంలోనే ఫైలెట్ శిక్షణ పొంది లైసెన్స్ కలిగి ఉన్నారు. పెళ్లికి ముందు వరకు ఆయన రెండు సీట్లు కలిగిన విమానాలను అద్దెకు తీసుకుని విహారయాత్రలు చేస్తుండేవారు. పెళ్లయిన తరువాత ఆయనకు ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయన విహార యాత్రలు చేయాలంటే కచ్చితంగా నాలుగు సీట్లు కలిగిన విమానం కావాల్సి వచ్చింది.
నాలుగు సీట్ల విమానాలు అద్దెకు లభించడం కొంచెం కష్టమైన పనే. అంతేకాకుండా అద్దెకు ఇచ్చేవి పాతవి కావడం కూడా కొంచెం రిస్క్‌తో కూడుకున్న పనే. దాంతో సొంతంగా విమానం తయారు చేసుకోవాలనుకున్నాడు. దాని గురించి అనేక పరిశోధనలు కూడా చేశాడు. దీనికి లాక్ డౌన్ సమయం కలిసొచ్చిందనే చెప్పవచ్చు.
సొంతంగా విమానాన్ని నిర్మించేందుకు జోహన్నెస్‌బర్గ్ కు చెందిన స్లింగ్ టీఎస్ఐ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ ఫ్యాక్టరీని సంప్రదించాడు. విమానాల తయారీకి ఆ సంస్థ ఆర్డర్ చేసే కిట్‌లకు అదనంగా మరో కిట్ ను ఆర్డర్ చేసేలా ఒప్పించి, కిట్ రాగానే తన పనిని ప్రారంభించాడు. దాదాపు 18 నెలలు కష్టపడి నాలుగు సీట్ల విమానాన్ని సొంతంగా రూపొందించాడు. ఇందుకుగానూ దాదాపు రూ.1.8 కోట్లు ఖర్చు పెట్టాడు.
విమానానికి చిన్న కుమార్తె పేరు వచ్చేలా జి-దియాగా పేరు పెట్టాడు. విమానం పూర్తిగా సిద్ధమయ్యాక కుటుంబంతో కలిసి ఆయన ఇప్పటి వరకు యూరోప్‌లోని జర్మనీ, ఆస్ట్రియా,చెక్ రిపబ్లిక్ దేశాలకు విహార యాత్రకు వెళ్లారు. అంతేకాదు ఖాళీ ఉంటే మరిన్ని ప్రదేశాలను చుట్టి వస్తామని అశోక్ తెలిపారు.