కేరళ మత్స్య శాఖ మంత్రి, సీపీఎం నాయకుడు సాజి షెరియాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలోని వనరులను దోచుకోవడానికే భారత రాజ్యాంగాన్ని తయారు చేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దోపిడీని భారత రాజ్యాంగం అంగీకరిస్తుందని, ప్రజలను దోచుకునేందుకు సహాయం చేసేలాగా రాజ్యాంగం ఉందని అన్నారు.
మల్లపల్లిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ‘ మనకు అందంగా రాసిన రాజ్యాంగం ఉందని మీరందరూ అంటున్నారు. కానీ దేశ ప్రజలను దోచుకునేందుకు ఉపయోగ పడేలా భారత రాజ్యాంగాన్ని రాసినట్టు నేను చెబుతాను’ అని అన్నారు.
భారత రాజ్యాంగం కార్మిక వర్గానికి న్యాయం చేయదని, ఎందుకంటే రాజ్యాంగంలో వారికి రక్షణ లేదన్నారు. దానికి బదులుగా లౌకికవాదం, ప్రజాస్వామ్యం లాంటి విషయాలను అందులో రాశారని పేర్కొన్నారు.
దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. మంత్రిని కేబినెట్ నుంచి తొలగించి ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన మంత్రి రాజ్యాంగానే అవహేళన చేయడమేంటని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇటీవల తెలంగాణ సీఎం కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది. తాజాగా కేరళ మంత్రి వ్యాఖ్యలపై రచ్చ జరిగింది.