జగద్గురువు ఆది శంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థకు ప్రతినిధి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ మంత్రి ఒకరు.వామపక్ష నేత ఎంబీ రాజేశ్ వర్కాల శివగిరి మఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
శంకరాచార్యులు, శ్రీనారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని వివరించిన మంత్రి.. కేరళకు ‘ఆచార్య’ అంటే అది శ్రీ నారాయణ గురువే తప్ప ఆది శంకరాచార్యులు కాదన్నారు.శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కులవ్యవస్థను సమర్థించారని, శ్రీనారాయణ గురువే మనుస్మృతి పారద్రోలేందుకు కృషి చేశారని అన్నారు.
శంకరాచార్య కుల వ్యవస్థను సమర్థించడంతో పాటు ప్రతినిధిగా ఉన్నారని, కుల వ్యవస్థను సమర్థించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురు విమర్శలు చేశారని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి ఆరోపించారు.
శంకరాచార్యులను విమర్శించింది నారాయణగురువేనని, కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీనారాయణ గురువే చెప్పారని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వీ మురళీధరన్ మండిపడ్డారు.
రాజేశ్ హిందువుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని, సవర్ణ-అవర్ణ మనస్తత్వాన్ని సృష్టించి ఒక వర్గం ఓట్లను పొందేందుకు సీపీఎం తప్పుడు ప్రచారం చేస్తుందని, శంకరాచార్యను అవమానించే ప్రయత్నాలను నిలువరించాలన్నారు.