ఇటీవలి కాలంలో ఫోటో షూట్ లు సర్వసాధారణం అయిపోయాయి. ఏ చిన్న వేడుకైనా కామనైపోయాయి. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ గా మారాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే నవ జంట ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా ఫోటో షూట్‌లు చేసుకుంటున్నారు.
కానీ.. కొందరు కపుల్స్ మాత్రం ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తో ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా ఓ నవ జంట పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మరణించగా.. వధువు పరిస్థితి విషమంగా ఉంది. కేరళలో సాహసోపేతమైన ‘పోస్ట్ వెడ్డింగ్’ షూట్ లు, ‘సేవ్ ది డేట్’ షూట్ లు క్రేజ్ గా మారిపోయాయి. అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కోజికోడ్ సమీపంలోని కడియంగడ్ కు చెందిన రెజిల్, కార్తీకలకు మార్చి 14న పెళ్లయింది. ఆ తర్వాత ఫోటో షూట్ కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అయితే, ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువైంది. ప్రమాదవశాత్తు నవ జంట నదిలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు.
రెజిల్ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెడ్డింగ్ షూట్ లు ట్రెండ్ అయినప్పటికీ.. సముద్రతీరాలు, గుట్టలు, నదుల్లో చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ట్రెండీగా ఉందని లైఫ్ రిస్క్ లో పెడుతున్నారు. ఫోటో షూట్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.