సాంప్రదాయానికి టెక్నాలజీ యాడ్ అవుతోంది. దేవాలయాల్లోకి రోబోటిక్ ఏనుగులు ఎంటర్ కాబోతున్నాయి. పలు ఆలయాల్లో ఉత్సవాల్లో గజవాహన సేవ సాంప్రదాయం. కొన్ని చోట్లైతే తప్పని సరి.
కేరళ, తమిళనాడులోని ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పవిత్రంగాను,శుభ సూచకంగాను భావిస్తారు. కొన్నికొన్ని క్షేత్రాల్లో ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఏనుగులను ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు.
అయితే ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారి కట్టినతర్వాత ఒక్కసారిగా ఘీంకరిస్తాయి.భక్తులపైకి దూసుకు వెళ్తూ ఉంటాయి. పరిసరాలను ధ్వంసం చేసిన సంఘటనలు సర్వసాధారణం. కొన్నిసార్లయితే శిక్షణ ఇచ్చిన మావటీలను సైతం చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలాంటివేవీ తమ ఆలయంలో జరగకూడదని అనుకున్నారో ఏమో.. ! ఓ రోబోటిక్ ఏనుగును ఉత్సవాల్లో వినయోగిస్తున్నారు. అది తల, తోక, చెవులను ఊపడంతోపాటు భక్తులకు ఆశీర్వాదాలు కూడా అందిస్తుందట.
కేరళలోని త్రిసూర్‌లో ఉన్న ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయిరుతాల్ వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు. అంబారీ కట్టి భగవంతుని సేవలో పాల్గోనున్నది. దీనిని సినీనటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా (PETA India) సభ్యులు ఆలయానికి అందజేశారు.
నదయిరుతాల్ వేడుకల్లో ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తున్నది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించడం ఇదే మొదటిసారి.
ఇది మర ఏనుగే అయినప్పటికీ నిజమైనదానిలానే ఉంటుందని ఆలయ అర్చకుడు రాజ్‌కుమార్ నంబూద్రి అన్నారు. ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్‌తో దీన్ని తయారుచేశారని తెలిపారు. నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందన్నారు.
మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని తెలిపారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారని తెలిపారు. దీనికి ఇరింజదపల్లి రామన్ అని నామకరణం చేశామని వెల్లడించారు.
కాగా, సాధారణణంగా ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆలయ అధికారులు అన్నారు.
ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ఆవిష్కరణగా భావిస్తున్నామని తెలిపారు. గత 15 ఏండ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించారని హెరిటేజ్ యానిమల్ టాస్క్‌ఫోర్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.