కేరళలో మరోసారి షిగెల్లా కేసు కలకలం సృష్టించింది. కోజికోడ్ పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. అలాగే, బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు.
అయితే, ఇంకా ఎవరికి వ్యాధి వ్యాపించలేదని వారు చెప్పారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. లక్షణాలు తీవ్రమైతే మరణం సంభవిస్తుందని, అందుకే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
అలాగే, షిగెల్లా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నివారణ కోసం పరిసర ప్రాంతంలోని బావుల్లో క్లోరినేషన్ చేపట్టారు. జ్వరం, డయేరియా లక్షణాలున్న వారిపై వైద్యారోగ్యశాఖ సర్వే సైతం నిర్వహించింది. ఇంతకు ముందు 2020లో కోజికోడ్‌లో షిగెల్లా కేసు నమోదైంది. ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఓ ఏడాదిన్నర బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా.. షిగెల్లా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది.
ఇక ఇది.. షిగెల్లా బ్యాక్టీరియా షిగెలోసిస్ అనే పేగు వ్యాధికి కారణమవుతుదని, అతిసారంతో పాటు, కడుపు నొప్పి, తిమ్మిరి, జ్వరం,వికారం, వాంతులు షిగెల్లా సాధారణ లక్షణాలని, కలుషితమైన ఆహారం తినడం వల్ల బ్యాక్టీరియా సోకడంతో వ్యాధి వస్తుందని వైద్యాధికారులు వివరించారు.
ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు. అలాగే, షిగెల్లా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని, వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
తరచూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలనీ, మంచి ఆహారం సేవించాలని వైద్యులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయొద్దని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు తీసుకోవాలని వైద్యులు సూచించారు.