యూట్యూబ్ లు, ఫేస్‌బుక్‌లు వచ్చిన తరువాత జనాలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు వంటకాలు చేస్తుంటే… కొందరు వైద్యం చేస్తున్నారు….రెండు కూడా సక్సెస్ అయితే ఫర్వాలేదు….కానీ వికటిస్తేనే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మరోసారి రుజువైంది.
యూట్యూబ్ లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారు చేశాడో 12 ఏళ్ల యువకుడు. దానిని తన మిత్రుడికి ఇవ్వగా.. తాగిన వెంటనే అనంతరం అతడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన కేరళ తిరువనంతపురం చిరాయింకీజులో జరిగింది.
కల్తీ మద్యం తాగిన బాలుడ్ని చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ బాటిల్‌ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఏం రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగానే వైన్ తయారు చేసి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు.