క్రికెట్ లో తప్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు.. ఔట్ ను నాటౌట్ గా.. నాటౌట్ ను ఔట్ గా ఇచ్చిన సందర్భాలున్నాయి. అలాగే నోబాల్స్ విషయంలో వివాదాలు కొనసాగాయి. తాజాగా ఐపీఎల్ లో నోబాల్ వివాదం చెలరేగింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ, రాజస్థాన్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది.
ఢిల్లీ విజయానికి లాస్ట్ ఓవర్ లో 36 పరుగులు కావాల్సి ఉండగా.. రోవ్ మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ వేసిన 20వ ఓవర్ లో తొలి 3 బంతులకు 3 సిక్సర్లు బాదాడు. అయితే.. మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ కు అంపైర్ ఓకే చెప్పడంతోనే వివాదం చెలరేగింది. అది నోబాల్ అని ఢిల్లీ జట్టు వాదించింది. చెస్ట్ వరకు బంతి ఫుల్ టాస్ వచ్చిందంటూ పావెల్ వాదించగా అంపైర్ ఒప్పుకోలేదు.
తీవ్ర అసహనంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తమ బ్యాట్స్ మెన్స్ ను గ్రౌండ్ వీడి బయటకు రావాలని పిలిచాడు. వెంటనే సహాయ కోచ్ ఆమ్రె కలగజేసుకొని గ్రౌండ్ లోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో మ్యాచ్ జరిగింది. చివరికి ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే పంత్, ఆమ్రె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఈ వివాదంపై స్పందించాడు. అసలు మీరేం అనుకుంటున్నారని పంత్, ఆమ్రేపై చిందులు తొక్కాడు.
ఆటలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయని.. అంతమాత్రాన ఇలా స్పందించడం తగదని అన్నాడు పీటర్సన్. ఢిల్లీ జట్టు ఇలా చేయడం క్రికెట్ కు మంచిది కాదని చెప్పాడు. నోబాల్ ఇవ్వకపోవడం వల్ల పంత్ కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయి ఉండొచ్చు కానీ.. అంపైర్ల తీరు కన్నా తనకు ఢిల్లీ జట్టు వ్యవహరించిన తీరే ఆశ్చర్యం కలిగించిందని తెలిపాడు. రికీ పాంటింగ్ ఉంటే ఇలా జరిగేది కాదని అనుకుంటున్నట్లు చెప్పాడు.