పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడైన దీపక్ టిను పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇతడ్ని పంజాబ్ లోని మాన్సా జైలు నుంచి పోలీసులు తమవెంట తీసుకువెళ్తుండగా వాళ్ళ కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. సిద్దు మూసేవాలా హత్యకేసుతో ప్రమేయమున్న నిందితులకు దీపక్ సహకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇతనిపై పోలీసులు ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు.
మరో కేసులో ఇతడిని విచారించేందుకు జైలు నుంచి బయటకు తీసుకువచ్చి ప్రైవేటు వాహనంలో పోలీసులు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇలాంటి కరడు గట్టిన క్రిమినల్స్ ని జైలు నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉండాలి. పైగా గట్టి భద్రత ఉన్న డిపార్ట్ మెంటల్ వాహనంలో తీసుకువెళ్లాలి. కానీ తక్కువ మంది సిబ్బందితో.. అదీ ప్రైవేటు వాహనంలో ఎందుకు తీసుకువెళ్లారన్నది తెలియడంలేదు.
జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కి సన్నిహిత సహచరుల్లో దీపక్ కూడా ఒకడని తెలుస్తోంది. సిద్దు మూసేవాలా కదలికలకు సంబంధించి ఇతగాడు ఈ గ్యాంగ్ స్టర్ కి ముందే సమాచారం ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ హత్యలో ప్రమేయమునట్టు చెబుతున్న గోల్డీ బ్రార్ అనే మరో నిందితుడితో కూడా దీపక్ టిను టచ్ లో ఉంటూ వచ్చాడట.
పారిపోయిన ఇతడికోసం పోలీసులు విస్తృతంగా గాలింపు ప్రారంభించారు. లోగడ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకు తాము కుట్ర పన్నింది నిజమేనని లారెన్స్ బిష్ణోయ్ అంగీకరించినట్టు ‘సిట్’ పోలీసులు తెలిపారు. తన సహచరుడైన విక్కీ మిద్దుఖేరా హత్యకు ప్రతీకారంగా మూసేవాలా ను మట్టుబెట్టామని అతడు తెలిపాడు. కానీ మిద్దుఖేరా హత్యలో మూసేవాలా హస్తం లేదని పోలీసులు గతంలో చెప్పారు. ఈ మర్డర్ లో మూసేవాలా ప్రమేయం ఉందని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భావించిందని వారు పేర్కొన్నారు. గత మే 29 న సిద్దు మూసేవాలాను ఈ గ్యాంగ్ స్టర్లు కాల్చి చంపారు.