ట్విట్టర్లో కీలక మార్పులు రాబోతున్నాయని అన్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను తన నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సామాజిక మాధ్యమం ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని అన్నారు.
మితవాదం, వామపక్ష వాదం అనే తేడాలు లేకుండా రాజకీయంగా తటస్థ వైఖరిని అనుసరించాలని ట్వీట్ చేశారు. ట్విట్టర్ ను 54 బిలియన్ డాలర్లకు మస్క్ కు విక్రయిస్తున్నట్లు సంస్థ ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
ట్విట్టర్‌కు, ఎలాన్ మస్క్‌కు కుదిరిన ఒప్పందం ప్రకారం.. సంస్థ వాటాదారులకు ఒక్కో షేరుకు 54.20 డాలర్లు దక్కుతాయి. ట్విట్టర్ ను కొనడానికి ముందు సంస్థలో తాను షేర్లు కొనుగోలు చేసినట్లు మస్క్ వెల్లడించిన రోజు కంటే ఈ షేరు విలువ దాదాపు 38శాతం అధికం.
మరోవైపు తమ ఉద్యోగుల పట్ల తనకు గర్వంగా ఉందని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ అన్నారు. ఆందోళనకర పరిస్థితుల్లోనూ వారు పనిపైనే దృష్టి కేంద్రీకరించి నిర్విరామంగా సేవలందిస్తున్నారని కొనియాడారు పరాగ్.