తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో ఈ రోజు సింగరేణి విషయంలో ఈటల వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ నడిచింది. సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలని ఈటల రాజేందర్‌ను కేటీఆర్ కోరారు. దేశంలో కోల్ బ్లాక్ ల నుంచి బొగ్గు కొనవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసిందని కేటీఆర్ అన్నారు.
విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాల సూచించిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం కేంద్రం అలా కోరిందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా పర్యటనకు వెళ్లి వచ్చాక వెంటనే ఆయన స్నేహితుడికి పెద్ద బొగ్గు గనులు కేటాయిస్తారని ఆయన ఆరోపించారు.
ఒక్క దోస్తు కోసం పనిచేసే సర్కార్ తమది కాదన్నారు. సింగరేణి గురించి ఈటల చాలా ఆవేదనతో మాట్లాడారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీ కాబట్టి ఈటల ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. సింగరేణి ప్రైవేట్ పరం చేసేది లేదని కేంద్రం చెబుతుందని ఈటల అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
మరి విశాఖ ఉక్కును తుక్కుగా అమ్ముతున్నది ఎవరంటూ ఆయన ఫైర్ అయ్యారు. అసలు బీజేపీ విధానం ఏంటని అడిగారు. అంతుకు ముందు ఈటల మాట్లాడుతూ… సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదన్నారు. సింగరేణికి బ్లాక్‌లు కేటాయిస్తే వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. బొగ్గు బ్లాక్‌లు వద్దంటూ కేంద్రానికి రాష్ట్రం రాసిన లేఖ తన వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు.