కరోనా వైరస్ ప్రభావం మొదట చైనాలో మొదలైంది కనుక వైరస్ అక్కడే పుట్టిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. పలువురు నిపుణులతో కూడిన బృందాన్ని ఇప్పటికే చైనాకు పంపగా వారు అక్కడ పర్యటిస్తూ అసలు వైరస్ అక్కడే పుట్టిందా ? అదే జరిగి ఉంటే అసలు అది ఎలా మొదలైంది ? ఎలా వ్యాప్తి చెంది ఉంటుంది ? వంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
కాగా చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందంలో ఒక సైంటిస్టు అయిన న్యూయార్క్ నివాసి, జువాలజిస్టు పీటర్ దస్‌జక్ వూహాన్‌లో సెంట్రల్ సిటీలో మీడియాతో మాట్లాడారు. తమ పర్యటన విశేషాలను ఆయన వివరించారు. ఫిబ్రవరి 10వ తేదీన చైనాలో తమ పర్యటన ముగుస్తుందని అప్పటి వరకు తాము ఆ పర్యటనలో తెలుసుకున్న అన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
అయితే వూహాన్ పర్యటనలో ఉన్న సదరు బృందానికి పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సైంటిస్టు పీటర్ మాటల ద్వారా వెల్లడి అయింది. వూహాన్‌కు సుమారుగా 1000 మైళ్ల దూరంలో ఉన్న గబ్బిలాల నుంచి వైరస్ అంత వేగంగా వూహాన్ సీఫుడ్ మార్కెట్‌కు ఎలా వ్యాప్తి చెందింది ? అని వారు విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ మార్కెట్ లో అనేక జీవాలను అమ్ముతారు కనుక గబ్బిలాలను అక్కడికి తెచ్చి ఉండవచ్చని, దాంతోనే ఆ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇక వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని అందువల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని, ఇది ముమ్మాటికీ చైనా నిర్లక్ష్యమేనని అనేక ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం మరో రెండు రోజుల్లో ఏం వివరాలను వెల్లడిస్తుంది ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కానీ సైంటిస్టు పీటర్ మాటలను బట్టి చూస్తే వారికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది కనుక ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాను దోషిగా నిలబెడుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకో రెండు, మూడు రోజులు వేచి చూడక తప్పదు.