నార్సింగ్ దారి దోపిడీ కేసులో నిందితుడైన కరణ్ సింగ్ అరాచకాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్ పై క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే కరణ్ సింగ్ నేరాలకు అలవాటు పడ్డాడు. గ్యాంగ్ ను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం, మత్త పదార్థాలు, ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించటం, కారు చోరీలు, ఓఆర్ఆర్ కాపు కాసి దోచుకోవటం.. ఎదురు తిరిగితే చంపటానికి కూడా వెనుకాడకపోవటం ఇలా ఒకటి కాదు ఎన్నో నేరాలు బయటపడుతున్నాయి.
ఇప్పటికే కరణ్ సింగ్ పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో రౌటీ షీట్ ఉంది. నార్సింగ్ దారి దోపిడీ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపైనే కత్తులతో దాడి చేయటం. విచారణకు పోలీస్ స్టేషన్ కు పిలిస్తే ఏకంగా సీఐపైనే దాడికి యత్నించటం.. ఇలా కరణ్ సింగ్ నేరాల చిట్టాను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు పోలీసులు.
అలాగే ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించటం, మైనర్ గా ఉన్నప్పటినుంచే కరణ్ సింగ్ నేరాలకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు. 10తో కలిసి గ్యాంగ్ గా ఏర్పడి దారి కాసి డబ్బులు, నగలు దోపిడీలు చేయటం.. ఎదిరించినవారిని చంపటానికి కూడా వెనుకాడకపోవటం కరణ్ సింగ్ గ్యాంగ్ చేసే అరాచకాల్లో కొన్ని మాత్రమేనని తెలిపారు.
అత్తాపూర్ పరిధిలో కరణ్ సింగ్ పై 5 కేసులతో పాటు.. ఓ రౌడీ షీటు కూడా నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా కరణ్ సింగ్ నేరాల చిట్టాను వెలికి తీస్తున్నారు పోలీసులు. నార్సింగ్ పీఎస్ పరిధిలో కరణ్ సింగ్ దారి దోపిడీ కేసులో విచారణ చేపట్టగా తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కటిగా నేరాలు బయటపడుతున్నాయి.