వచ్చే ఏడాది తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలున్నాయి. ఒకటి బీజేపీ సిట్టింగ్ సీటు అయిన మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ కాగా, మరోకటి టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయిన వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం. ఈ రెండు స్థానాల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి.
అయితే, తెలంగాణలో గ్రాడ్యుయేట్ స్థానాలు అధికార టీఆర్ఎస్ గెలవటం అంత హీజీ కాదు. ప్రశ్నించే గొంతుకలకే పట్టభద్రులు పట్టం కడుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, ఈ గ్రాడ్యుయేట్ స్థానాలు అన్ని పార్టీలకన్నా బీజేపీ, కాంగ్రెస్ లకే అత్యంత కీలకం కానున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ… తమ గెలుపు గాలివాటం కాదని, అన్ని వర్గాల మద్దతు ఉందని నిరూపించుకోవటానికి మంచి అవకాశంగా ఉంది. పైగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పని ఖతం అయిందని నిరూపించే సదవకాశంగా కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూ ఇవి జీవన్మరణ ఎన్నికలు కానున్నాయి. రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్లేసులో బీజేపీ దూసుకొస్తుంది. దీంతో బీజేపీని నిలువరించి ఈ ఎన్నికల్లో గెలుపొందటం ద్వారా కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.