బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో అడుగుపెట్టబోతుంది. ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్,మాజీ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథితో పాటు ఏపీకి చెందిన వేలాది మంది ఈ నెల 2న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయా నేతల చేరికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నేతల నిర్ణయంతో ఏపీ భవిష్యత్ కు బంగారు బాటలు పడ్డాయని ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జేఏసీ అభిప్రాయపడింది. గడిచిన తొమ్మిదేండ్లలో చంద్రబాబు,జగన్ అధ్వాన్న పాలనతో రాష్ట్రంలోని అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయన్నారు.
యువతతో పాటు, రైతులు,విద్యార్థులు,మహిళలు, అన్నివర్గాలు తీరని అన్యాయానికి గురయ్యారని, వ్యవసాయ, సంక్షేమ రంగాలతో పాటు అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని ఆరోపించారు. అన్ని వనరులు ఉన్న ఏపీని ఆదుకొనే నాయకుడు లేక అల్లాడుతున్నదని, చారిత్రక ఉద్యమనేతగా, పరిపాలనధక్షుడిగా, సకల జనుల సంక్షేమం దిశగా పాలన వ్యవస్థను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి ద్వారానే ఏపీ రాష్ట్ర సమస్యలు తీరి అభివృద్ధి చెందుతుందన్నారు.
మోదీ అన్యాయమైన విధానాలను ఎదిరించి సకల సమస్యల నుంచి భారత దేశాన్ని గట్టెక్కించే ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో దండుగా కదలడం ఖాయమని, ఏపీ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ జెండా వాడవాడలా రెపరెపలాడి తీరుతుందన్నారు. ఆ దిశగా నిర్ణయం తీసుకొని కదిలిన హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేరుతున్న ఏపీ నాయకుల నిర్ణయం కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని, వారందరికీ ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జేఎసీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఈ చేరికలతో బీఆర్ఎస్ ఏపీలో ఖాతాను ఓపెన్ చేయబోతుంది.