శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య నేడు మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై జరిగే మూడు టీ20ల సిరీస్ కు టీంఇండియా సిద్దం అయింది. లక్నో వేదికగా జరిగే తొలి మ్యాచ్ కు కీలక ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలో ఇటీవల స్వదేశంలో టీమిండియా సిరీస్ ల మీద సిరీస్ లు గెలుస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌పైనా భారత్ కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్రతిభావంతులకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ నిలదొక్కుకోవాలంటే అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్ లో మరో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అవకాశమిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇద్దరిలో ఎవరికి అవకాశం లభించినా వారికి తమ ప్రతిభను కనబరుచుకోవడానికి వేదికగా మార్చుకునేందుకు ఇదో అవకాశం అని నిపుణులు చెప్తున్నారు.
టీం ఇండియా: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (WK), శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ (C), సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా గ్రౌండ్ లోకి దిగనున్నారు.
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కమిల్ మిషార (WK), దినేష్ చండిమాల్, చరిత్ అసలంక, దసున్ షనక (C), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార లు ఆడనున్నారు.