తెలంగాణ హై కోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో కీలక విషయాలను వెల్లడించారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావాలనే వివేకానంద రెడ్డిని ఓడించారని ఆమె ఆరోపించారు. 2019లో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారనే కారణంతోనే ఆయన్ని హత్య చేశారని ఆమె ఆరోపించారు.
ఎంపీ టికెట్ కోసమే ఆయన్ని హత్య చేసినట్టు తాము భావిస్తున్నామన్నారు. వైఎస్ వివేక హత్య కేసు నిందితులకు ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే డబ్బులు అందాయని ఆమె పేర్కొన్నారు. వివేక హత్యకు ముందు సునీల్ యాదవ్ ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉన్నారని ఆమె ఆరోపణలు చేశారు.
హత్య గురించి వివేకా పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి చెప్పే కంటే ముందే ఆ విషయం ఎంపీకి తెలుసన్నారు. కానీ మూడో వ్యక్తి ద్వారా ఆ విషయం తెలుసుకోవాలని ఆయన ఎదురు చూశారన్నారు. వివేకా మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి సమాచారం అందించారన్నారు.
హత్య అనంతరం అందరు నిందితుల్ని అవినాష్ కాపాడుకుంటారని ఎర్ర గంగి రెడ్డి మిగిలిన నిందితులతో అన్నాడని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన మరణాన్ని సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు.
వివేకా ఇంటికి శశికళ వచ్చినప్పుడు వివేక గుండె పోటుతో మరణించారని ఆమెకు అవినాష్ చెప్పారన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా గుండె పోటు, రక్తపు వాంతులతో మరణించారని అబ్బద్దం చెప్పారని తెలిపారు. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే రూ. 10 కోట్లు ఇస్తానని అవినాష్ ఆశ పెట్టారని గంగాధర్ వాంగ్మూలం ఇచ్చారన్నారు.