– బీఆర్ఎస్ లో కవితకు కీలక బాధ్యతలు?
– ఢిల్లీలో కేసీఆర్ మకాం
– రెండు, మూడు రోజులు అక్కడే..
– పలు పార్టీల నేతలతో చర్చలు
– అన్నీ తానై చూసుకుంటున్న కవిత
– తెలంగాణను కేటీఆర్ కు అప్పగించినట్లేనా?
– జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బాధ్యత అంతా కవితదేనా?
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కేసీఆర్ కుటుంబంలో చాలాకాలంగా అధికారం కోసం కొట్లాట జరుగుతోందనేది ప్రతిపక్షాల వాదన. ఒక్కోరోజు ఇంట్లో వస్తువులు కూడా పగిలిపోయే రేంజ్ లో గొడవలు జరిగాయని మీడియా ముందే చెప్పారు విపక్ష నేతలు. సీన్ కట్ చేస్తే.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో సందడిగా తీర్మానం ప్రవేశపెట్టి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అయితే.. ఇంత హడావుడిలో అందరి చూపు ఎమ్మెల్సీ కవితపైనే ఉంది. ఆమె ఎక్కడున్నారు? జాతీయ పార్టీ అనౌన్స్ మెంట్ కార్యక్రమానికి కవిత దూరంగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం వల్లే కవిత బీఆర్ఎస్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే చర్చ సాగింది. అంతేకాదు.. ఆమెను దూరం పెట్టారనే ప్రచారం సాగింది. కానీ, ములాయం పార్థివదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన కేసీఆర్ తోపాటు కవిత కూడా ఫ్లైట్ ఎక్కారు. అక్కడ తండ్రి వెంటే ఉంటూ అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో భాగంగా చర్చలు సాగిస్తున్నారు. వీటన్నింటినీ కూడా కవితే చూసుకుంటున్నారని టాక్. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అద్దె భవనంలో వివిధ పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజులు అక్కడే ఉండి పార్టీ నేతలతో కూడా మఖ్యమైన విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలనేది కేసీఆర్ ఆలోచన. ఆ తర్వాత జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. దానికి తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. లోక్ సభ సభ్యురాలిగా వ్యవహరించిన కవితకు ఢిల్లీలోని పలు పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ బాధ్యతలను కవితకు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. పార్టీ జాతీయ కన్వీనర్ బాధత్యలు అప్పగిస్తారంటూ తెగ ప్రచారం సాగుతోంది. దీంతో తెలంగాణ వ్యవహారాలు కేటీఆర్ చూసుకుంటారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో కవిత, తెలంగాణలో కేటీఆర్ కీలక పదవుల్లో ఉండేలా ప్రణాళికలను కేసీఆర్ సిద్ధం చేసినట్లుగా మాట్లాడుకుంటున్నారు.
నిజానికి ప్రతిపక్షాలు మొదట్నుంచి చెబుతోంది ఇదేనని రాజకీయ పండితులు అంటున్నారు. కేటీఆర్, కవిత మధ్య కుర్చీ పంచాయితీ ఉందని.. ఇప్పుడు వీరిద్దరికీ న్యాయం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత బీజేపీ నేతలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో తగాదాలను తగ్గించుకునేందుకే బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. అన్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ కవిత, కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించి తలనొప్పి తగ్గించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు.