కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్-2 మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 14న రిలీజైంది. మొదటి రోజు నుంచే ఆల్‌టైమ్ రికార్డులతో హోరెత్తిస్తుంది. విడుదలై నాలుగు వారాలు దాటిన బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గలేదు. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలు వస్తున్నాయి.. వెళుతున్నాయి. కానీ, యశ్ సినిమాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమలో తాజాగా కేజీఎఫ్-2 సరికొత్తగా మరో మైలురాయిని దాటింది.
హిందీ మార్కెట్ పరంగా చూస్తే.. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ‘కేజీఎఫ్-2’ రెండో స్థానానికి చేరింది. ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు 400 కోట్లు దాటాయి. హిందీలో నాలుగో శుక్రవారం 3.85 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ మూవీ టోటల్ హిందీ వెర్షన్ వసూళ్లు 401.80 కోట్లు అయ్యాయి. ఈ సినిమా కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన ‘బాహుబలి 2’ ఉంది.
హిందీలో ‘బాహుబలి 2’ సినిమాకు 510.99 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరో 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే.. ఆ సినిమా రికార్డును బీట్ చేసే అవకాశం ‘కేజీఎఫ్-2’ సొంతం అవుతుంది. అయితే, ఫైనల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి.. ఈ కలెక్షన్లను అధిగమిస్తుందా లేదా అనే విషయం హిందీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, ఇది ఒక కన్నడ మూవీకి దక్కిన అరుదైన గౌరవం. ఇప్పటిదాకా రాజ్ కుమార్, రవిచంద్రన్, అనంత్ నాగ్ లాంటి దిగ్గజాల వల్ల కానిది యశ్ అతి తక్కువ సమయంలో అందుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ‘కేజీఎఫ్-2’ దెబ్బకు బాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన స్టార్ హీరోల సినిమాలు పోటీని తట్టుకోలేక డిజాస్టర్లుగా నిలిచాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.