ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి బక్సాఫీస్ ముందు రికార్డులు సృష్టిస్తున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్-2 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధ్యం కానీ రీతిలో రికార్డులను నెలకొల్పుతోంది. సరికొత్త రికార్డులను మూటగట్టుకుంటోంది.
విడుదలైన నాటినుంచి నేటి వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్గేస్ట్ ఫిలిం దంగల్ సినిమా కలెక్షన్లను దాటేసిన కేజీఎఫ్-2.. తాజాగా టాలీవుడ్ బిగ్గేస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను దాటేసినట్టు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా రూ.1160 కోట్ల గ్రాస్ ను సాధించి.. ఆర్ఆర్ఆర్ వసూళ్లను క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. భారత సినీ చరిత్రలోని బిగ్గేస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన కేజీఎఫ్-2.. కన్నడ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో విజయం సాధించి అందరిని అబ్బుర పరిచింది.