కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీఎఫ్ 2’ ప్రపపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయినా.. యశ్ యాక్టింగ్, సినిమా స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్, డైరెక్టర్ టేకింగ్‌ని సినీ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు పని చేసిన ఎడిటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు.
ఎందుకంటే.. కేజీఎఫ్ 2 సినిమాను ఎడిటింగ్‌ను చేసింది ఉజ్వల్ కులకర్ణి అనే 19 ఏళ్ల కుర్రాడు. ఇలాంటి భారీ చిత్రాలకు మామూలుగా ఎంతో అనుభవం ఉన్న, పేరున్న ఎడిటర్లనే పెట్టుకుంటారు. కానీ, షార్ట్ ఫిలిమ్స్‌కు ఎడిట్ చేసే కుర్రాడిని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చాడు. అతని మీద నమ్మకంతో భారీ బడ్జెట్ చిత్రాన్ని అతని చేతిలో పెట్టాడు. అందుకు ఉజ్వల్ కులకర్ణి కేజీఎఫ్ 2 అద్భుతంగా మలిచి.. తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.
టాలెంట్ ఉంటే అవకాశమే నిన్ను వెతుక్కుంటూ నిన్ను చేరుతుంది అనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. చిన్న వయసులోనే ఫిలిం ఎడిటింగ్‌లో మెలకువలు నేర్చుకుని, షార్ట్ ఫిలిమ్స్‌కు సాంకేతిక సహకారం అందిస్తూ.. ఫ్యాన్ ఎడిట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు ఉజ్వల్. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-1’కు సంబంధించి ఒక అదిరిపోయే ఎడిట్ చేశాడు. అది అనుకోకుండా ప్రశాంత్ కళ్లలో పడింది. ఆయనకు అది బాగా నచ్చేసి.. ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసే బాధ్యత అప్పగించాడు.
వచ్చిన అవకాశాన్ని ఉజ్వల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇంత తక్కువ వయస్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్‌గా పనిచేయడం నిజంగా ఉజ్వల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు. ఎడిటర్‌గా మంచి భవిష్యత్తు అతనికి ఉంటుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.