రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వడమనేది దాదాపు అసంభవం. ఎందుకంటే, ఒకే రోజు 2 సినిమాలొస్తే, ఆ రెండు సినిమాలకు రెవెన్యూలు పడిపోతాయి, రికార్డులు క్రియేట్ అవ్వవనేది అందరికీ తెలిసిన సత్యమే. అందుకే మ్యాగ్జిమమ్ మాట్లాడుకొని రిలీజ్ చేసుకుంటారు. కానీ తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి టైమ్ లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాక తప్పదు. ఇప్పుడా పరిస్థితి రెండు పెద్ద సినిమాలకు ఎదురైంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కేజీఎఫ్-2కు అనూహ్యంగా కోలీవుడ్ నుంచి పోటీ ఎదురైంది. విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆరోజు తమిళ నూతన సంవత్సరం. కాబట్టి విజయ్ సినిమాకు ఆ తేదీ లాక్ చేశారు. ఫిబ్రవరి 14 నుంచి ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు.
అయితే ఇదే తేదీని చాన్నాళ్ల కిందటే యష్ ప్రకటించాడు. అతడు నటిస్తున్న కేజీఎఫ్2 సినిమాను కూడా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. దీంతో కోలీవుడ్ లో యష్, విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ దాదాపు ఫిక్స్ అయింది. ఈ విషయంలో చర్చలు, సర్దుబాట్లు ఉండకపోవచ్చు.
ఎందుకంటే.. తమిళనాట విజయ్ సూపర్ స్టార్. అతడు డేట్ చెప్పాడంటే వచ్చేస్తాడంతే. అతడు వచ్చాడంటే కోలీవుడ్ లో పండగే. యష్ వస్తున్నాడని తేదీ మార్చునే టైపు కాదు విజయ్. ఇప్పుడు విజయ్ సినిమా బరిలో ఉందని, కేజీఎఫ్2ను వాయిదా వేసుకోలేరు. ఎందుకంటే, ఇది పాన్ ఇండియా మూవీ. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలి. దీంతో పోటీ అనివార్యమైంది.