భక్తజన సందోహం నడుమ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన నాలుగో నెంబర్ క్రేన్ దగ్గర బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. సుమారు 6 గంటల పాటు కొనసాగింది. భక్తులు భారీగా తరలివచ్చారు.
ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం ఇచ్చాడు ఖైరతాబాద్ గణేశుడు. 40 అడుగుల ఎత్తులో, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరి పూజలందుకున్నాడు. 9 రోజుల పూజల అనంతరం మహాగణపతిని నిమజ్జనం చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకున్నారు.