వినాయక చవితి వస్తుందంటే చాలు అందరి కళ్లు ఖైరతాబాద్ వైపే ఉంటాయి. అక్కడ ఏ విగ్రహం పెడుతున్నారు.. ఎంత ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు.. ఏ పేరు పెట్టారు.. ఇలా అనేక విషయాలను ఆరా తీస్తుంటారు. ఈ ఏడాది గణపయ్య రూపానికి సంబంధించిన నమూనా చిత్రం తాజాగా విడుదలైంది.
ఈ ఏడాది పంచముఖ లక్ష్మి గణపతి అవతారంలో భారీ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆలయ కమిటీ గణేషుడి రూపాన్ని విడుదల చేసింది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి 50 అడుగులతో మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
స్వామి వారికి కుడివైపున సుబ్రహ్మణ్యస్వామి, ఎడమ వైపున లక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించనున్నారు. 5 తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు. అలంకరణ కోసం తలలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.
ఖైరతాబాద్ గణనాథుడిని నెలకొల్పడం ఈ ఏడాదితో 68 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతీఏటా మాదిరిగానే ఈసారి కూడా లడ్డూను ఆంధ్రప్రదేశ్ లోని తాపేశ్వరం నుంచి తీసుకురానున్నారు.