హిమాచల్ ప్రదేశ్ లో ఖలిస్తాన్ జెండాలు ఆదివారం కలకలం రేపాయి. ఏకంగా రాష్ట్ర అసెంబ్లీ మెయిన్ గేట్ కే జెండాలను దుండగులు కట్టడంతో అధికారులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.
దీనిపై ఎస్పీ కుశాల్ శర్మ స్పందించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయన అన్నారు. ఆదివారం ఉదయం అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలను గుర్తించిన వెంటనే తొలగించామన్నారు.
పంజాబ్ నుంచి వచ్చిన కొందరు పర్యాటకులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.
రాష్ట్ర రాజధాని సిమ్లాలో ఖలిస్తాన్ జెండాను ఎగురవేయాలని సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను గత నెలలో పిలుపునిచ్చారు.
దీంతో పత్వంత్ సింగ్ వ్యాఖ్యలకు నిరసనగా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిమ్లాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వెలుపల ఖలిస్తాన్ జెండాను దహనం చేసి ఖలిస్తాన్ డిమాండ్‌లకు వ్యతిరేకంగా నినాదాలను ఇచ్చింది.