ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో హిందూ ఆలయాలపై దాడులకు దిగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు క్వీన్స్ ల్యాండ్ రాజధాని బ్రిస్ బేన్ లోని భారత దౌత్య కార్యాలయాన్ని తమ టార్గెట్ గా ఎంచుకున్నారు. ఈ నెల 21 న ఈ కాన్సులేట్ పై ఎటాక్ చేసిన వారు ఈ భవనంపై తమ ఖలిస్తానీ పతాకాన్ని ఎగురవేశారు. కాన్సులేట్ కి అటాచ్ ఆఫీసరుగా ఉన్న అర్చనా సింగ్ 22 న కార్యాలయానికి రాగానే భవనంపై ఎగురుతున్న ఈ పతాకాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.
. హిందూ ఆలయాలపై ఖలిస్థాన్ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇప్పుడు ఈ దుశ్చర్యకు దిగారని ఆమె ఆరోపించారు. ఆమె వెంటనే క్వీన్స్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖలిస్తానీ పతాకాన్ని వారు తొలగించారని, తమ భద్రత కోసం వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ఆమె చెప్పారు.
ఇండియాలో మొదట కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు మతపరమైన మైనారిటీలను ఊచకోత కోస్తున్నాయంటూ ఖలిస్తానీ శక్తులు ఇండియాను అప్రదిష్ట పాల్జేసేట్టు సోషల్ మీడియాలో వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయి.
1984 నవంబరులో సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, ఇప్పుడు బీజేపీ సర్కార్ కూడా అదే పంథాను అనుసరిస్తోందని ఆరోపిస్తున్నాయి. 1992 లో బాబరీ మసీదు కూల్చివేత నుంచి 2002 లో గుజరాత్ అల్లర్ల వరకు ముస్లిముల హత్యాకాండ కొనసాగిందని వీటిలో పేర్కొన్నాయి.