పంజాబ్ లో ఖలిస్థానీ నేత అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోతున్నాడు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు సుమారు వంద వాహనాల్లో వస్తున్నారని తెలిసిన ఇతగాడు జలంధర్ జిల్లాలో చివరిసారిగా నిన్న సాయంత్రం వారి కంటబడ్డాడని..దాంతో వెంటనే మోటార్ సైకిల్ పై పరారయ్యాడని తెలుస్తోంది. తనకోసం పెద్దఎత్తున వేట ప్రారంభించారని తెలుసుకున్న అమృత్ పాల్.. ఎప్పటికప్పుడు పారిపోయేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ఇతని సన్నిహితుడు, ఇతని ఆర్ధిక వ్యవహారాలు చూసే దల్జీత్ సింగ్ కల్సి ని పోలీసులు హర్యానాలో అరెస్టు చేశారు. తనను టెర్రరిస్ట్ భింద్రన్ వాలే ఫాలోవర్ గా చెప్పుకునే అమృత్ పాల్ సింగ్ ని ఇప్పటికే పోలీసులు ‘పరారీలో ఉన్న నేరస్తుడి’గా ప్రకటించారు.
ఖాకీలు నీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారని ఇతని సహచరుల్లో కొందరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను షేర్ చేశారు. దీంతో అమృత్ పాల్.. పోలీసుల కళ్ళు గప్పి పారిపోతున్నాడు. ఇక రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీసులను సోమవారం మధ్యాహ్నం వరకు రద్దు చేశారు. తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా చూసేందుకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, అమృత్ పాల్ సింగ్ ని సాధ్యమైనంత త్వరగా పట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.
అమృత్ పాల్ అరెస్టుకు తీసుకోవలసిన చర్యలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఈ నెల 2 నే సమావేశమై చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు ఫలితం లేకపోయింది. అమృత్ పాల్ అరెస్టు విషయంలో పంజాబ్ పోలీసులకు సహకరించేందుకు కేంద్రం నిన్న అదనపు బలగాలను రాష్ట్రానికి పంపినట్టు తెలుస్తోంది. తమ సహచరులను విడిపించేందుకు ఈ ఖలిస్తానీ నేత అతని సహచరులు సుమారు నెల క్రితం అమృత్ సర్ జిల్లాలోని అజ్ నాలా పోలీసు స్టేషన్ పై కత్తులు, గన్స్ తో దాడి చేసినప్పటి నుంచి ఇతని కోసం వేట మొదలైంది. వీరి దాడితో పోలీసులు మరో దారిలేక అమృత్ పాల్ సహచరుల్లో ఒకడైన లవ్ ప్రీత్ సింగ్ ను విడిచిపెట్టవలసి వచ్చింది.
ఆ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ‘వారిస్ పంజాబ్ దే’ పేరిట రాడికల్ సంస్థను ప్రారంభించిన అమృత్ పాల్ సింగ్.. ఇండియా నుంచి పంజాబ్ వేరుపడి ఖలిస్థాన్ దేశంగా ప్రకటించుకోవాలని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నాడు. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తోను, విదేశాల్లోని ఉగ్రవాదబృందాలతోను ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇతడ్ని అరెస్టు చేసినట్టు మొదట వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు దాన్ని ధ్రువీకరించలేదు.