– రసవత్తరంగా ఖమ్మం పాలిటిక్స్
– పనికిరాని ఎద్దుతో పోటీనా అంటున్న రేగా
– కుక్కతోక వంకరన్న హరిప్రియ
– బీఆర్ఎస్ కు 2, 3 నెలలేనంటున్న పొంగులేటి
– పార్టీ మార్పుపై ఇంకా సస్పెన్స్
ఒకప్పుడు ముగ్గురిది ఒకే పార్టీ.. తరువాత ముగ్గురు కలిసి వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. నిన్నా..మొన్నటి వరకు ఈ ముగ్గురిది ఓకే నావ ప్రయాణం కాని, ఇందులో నుంచి ఒకరు బయటికి అడుగు వేయడానికి సిద్దమయ్యారు. ఇంకేముంది..మిగతా ఇద్దరికి ఆ ఒక్కరు టార్గెట్ అయ్యారు. ఇదీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను రసవత్తరంగా మార్చుతున్న ఖమ్మం జిల్లా పాలిటికల్ చిత్రం.
మారుతున్న సమీకరణాలతో అసంతృప్తితో ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ని బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న మిగతా ఇద్దరు నేతలు టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరో వైపు పొంగులేటి మాత్రం దూకుడు పెంచుతున్నారు. సభలు,సమావేశాలు నిర్వహిస్తూ జనాన్ని ఆకర్షించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్ ను డైరెక్ట్ గా విమర్శిస్తూ కౌంటర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ఇంకా రెండుమూడు నెలలు మాత్రమే ఉంటుందని ఆత్మీయ సభల్లో బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అనుచరులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్నారాయన. దీంతో ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మరో వైపు పొంగులేటికి రేగా ఇంకా హరిప్రియల నుంచి కౌంటర్ వార్ ఎదురవుతుంది. పనికి మాలిన ఎద్దుతో దండయాత్రకు వస్తే ఎలా.. ఇక మోయడం నావల్ల కాదని ఎద్దు కుర్రోముర్రోమని మొత్తుకుంటుందని.. అయినా కాని బలవంతంగా ఆ ఎద్దుతో పోటీకి దిగుతున్నారని..పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. ఇక ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా పొంగులేటిని డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో ఖమ్మం రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. పొంగులేటి ఆత్మీయ సభ నిర్వహించిన ఇల్లందులోనే ఆత్మీయ సభను పెట్టిన ఆమె.. పొంగులేటిపై కౌంటర్ల వర్షం కురిపించి యాక్షన్ ప్లాన్ లోకి దిగారు.
స్వార్థంతో నిండిన వ్యక్తి నడక ఎంత స్వార్థపూరితంగా ఉంటుందో.. కుక్క తోకను ఎలా సరి చేయలేమో అదే విధంగా అలాంటి వ్యక్తులను కూడా సరి చేయలేమని పొంగులేటిని ఉద్దేశించి ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఖమ్మం పాలిటిక్స్ హైవోల్టేజ్ మీదున్నాయి. ఇక పొంగులేటీ పార్టీ మారడం ఖాయమని తెలుస్తున్నా.. ఎప్పుడు ఏ పార్టీ మారుతారన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఈ నెల 18న ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని అనుకున్నా.. ఆయనకు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం అందడంతో ఆయన డైలామాలో ఉన్నట్టు తెలుస్తోంది.