-అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మం బహిరంగ సభ
-జనసమీకరణే కీలకం
-5లక్షల మంది టార్గెట్
-ఇద్దరు మంత్రులకు ఆ బాధ్యత
-పొంగులేటిని సింగిల్ చేయడమే సభ సెకండ్ ఏజెండా..
-పొంగులేటి బ్యాచ్ కంట్రోల్ కు బీఆర్ఎస్ కసరత్తు
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత మొదటి సారి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 18 న జరుగుతున్న ఈ సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు గట్టి మెసేజ్ ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రెండు రాష్ట్రాలకు బార్డర్ అయిన ఖమ్మం జిల్లాను వేదికగా కేసీఆర్ ఎంచుకోవడం జరిగింది.
అయితే ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణ చేయడమే పార్టీ ముందున్న బిగ్ టాస్క్. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీ నుంచి ప్రజలను సభకు తరలించే బాధ్యతను అప్పగించారు. దీంతో పాటు ఏపీ బీఆర్ఎస్ నేతలైన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థ సారథి తదితరులు చూసుకుంటున్నప్పటికీ మంత్రులు తలసాని,శ్రీనివాస్ గౌడ్ లు కూడా వారి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఉన్న సంబంధాలు జన సమీకరణలో కీలకంగా పనిచేస్తున్నాయి. అయితే సుమారు ఐదు లక్షల మంది జనాన్ని సభకు తరలించాలని లక్ష్యంగా బీఆర్ఎస్ పెట్టుకుంది.
దీంతో తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఏపీ నుంచి భారీ సంఖ్యలోనే జనాన్ని తరలించేందుకు కసరత్తు మొదలైంది. ఏపీ వ్యవహారాలను ఇద్దరు మంత్రులతో పాటు అక్కడి బీఆర్ఎస్ నేతలు, కుల సంఘాల పెద్దలు చూసుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న కొత్తగూడెం,మహబూబాబాద్,ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం తదితర జిల్లాల నుంచి కూడా ప్రజలు, పార్టీ కార్యకర్తలను తరలించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ కు ఉన్న బలమేంటో ఈ సభ ద్వారా తెలియజేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
సభకు ఏపీ నుంచి జనాన్ని తరలించడంతో పాటు అక్కడ పార్టీకి ఉన్న ఆదరణపై ఇప్పటికే ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటు రావెల కిషోర్ బాబు,పార్థ సారథి తదితరులు కేసీఆర్ తో చర్చించారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా బహిరంగ సభపై ప్రభావం గురించి ఆ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున బాధ్యతలను ఆ జిల్లా నేతలకే వదిలిపెట్టకుండా ఇతర మంత్రులను సైతం కేసీఆర్ భాగస్వాములను చేస్తున్నారు. సక్సెస్ చేసే బాధ్యత మంత్రి హరీశ్ రావ్ కు అప్పజెప్పడంతో రెండు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. సభా వేదిక ఏర్పాట్లను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు చూసుకుంటున్నారు. కేరళ,పంజాబ్, ఢిల్లీ సీఎంలతో పాటు సీపీఐ, సీపీఎం జాతీయ స్థాయి నేతలు కూడా సభకు హాజరుకానున్నారు. అయితే జన సమీరణే కీలకం కావడంతో వర్క్ ను చాలా పకడ్బందీగా డివైడ్ చేయడంతో పాటు ప్రతి నియోజక వర్గం నుంచి నిర్దిష్ట సంఖ్యలో జనాలను సభకు తరలించే విధంగా స్కెచ్ వేయడం జరిగింది.
ఇక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఈ సభ ద్వారా పొంగులేటిని ఒంటరి చేయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరేందుకు రెడీ అవ్వడంతో ఆయనతో పాటు జిల్లాలోని కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అయితే వీరిని కట్టడి చేయడానికి ప్రగతి భవన్ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉంటుందని.. భవిష్యత్తులో ఎమ్మెల్యే లేక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని ఆశ చూపిస్తున్నారు.