కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఈ రోజు ప్రతిపక్ష పార్టీల ఎంపీల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం 10 గంటలకు సమావేశమవుదామని ప్రతిపక్ష ఎంపీలను ఆయన కోరారు.
ఆదానీ కంపనీ వ్యవహారం నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకంపనాలు రేపింది. హిండెన్ బర్గ్ నివేదికపై భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీతో నిస్పాక్షిక విచారణ జరిపించాలని సభలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఈ విషయంలో పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా నోటీసులను లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభాపతులు తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలు రోజంతా వాయిదా పడ్డాయి. సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.
మరోవైపు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దీన్ని కుంభకోణంగా అభివర్ణించారు. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆదానీ షేర్లు భారీగా పడిపోతున్నాయి.