లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేయడటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేసి, నాశనం చేస్తున్న వ్యక్తులు దాన్ని కాపాడాలంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రధాని మోడీ ఓ నియంతలాగా దేశాన్ని నియంతృత్వ ధోరణిలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ పాలనలో న్యాయ శాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ఆయన ధ్వజమెత్తారు.
అదానీ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఉభయ సభలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
తాము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు తమ మైకులకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సభలో గందరగోళం నెలకొందన్నారు. కొరియా పర్యటనలో వున్నప్పుడు 70 ఏండ్లలో భారత్‌లో జరిగిన అభివృద్ధిని ప్రధాని తక్కువ చేసి మాట్లాడారన్నారు. కెనడాలోనూ అలాంటి వ్యాఖ్యలే చేశారని చెప్పారు. ప్రధాని మోడీ చేస్తే ఒప్పు, రాహుల్ గాంధీ చేస్తే తప్పు అయిపోతుందా?అని ఆయన ప్రశ్నించారు.