పిల్లలు తమకు తమ తండ్రుల నుంచో, దగ్గరి బంధువుల నుంచో ఎదురైన అమానుష అనుభవాల గురించి ధైర్యంగా చెప్పగలగాలని నటి, రాజకీయ నేత ఖుష్బూ సూచించారు. తన ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించాడని ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. 15 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు తానెవరికీ ఈ విషయాన్నీ చెప్పలేకపోయానన్నారు. భయం వల్లో, ఈ విషయం చెబితే తన తల్లి ఎలా స్పందిస్తుందోనన్న భావన వల్లో తనలోనే దీన్ని దాచుకుని కుమిలిపోయాన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన బాల్యంలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి వివరించారు. చిన్నతనంలో ఎప్పుడైనా లైంగిక వేధింపులకు గురయితే ఆ పసివారికి జీవితాంతం భయంగా ఉంటుందని, అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా..ఎవరైనా సరే అని ఆమె అన్నారు. తన తల్లి వివాహ బంధం కూడా వేదనతో కూడుకుని ఉందని, తన తండ్రి ఆమెను కొట్టడం తన జన్మ హక్కులా భావించేవాడని ఖుష్బూ చెప్పారు.
పిల్లలను హింసించేవాడు. సొంత కూతురినే లైంగికంగా వేధించేవాడు. నా 8 ఏళ్ళ వయస్సు నుంచే అతడి వేధింపులు ప్రారంభమయ్యాయి అని ఆమె తెలిపారు. 15 ఏళ్ళ వయస్సులో మానసిక వేదన భరించలేక అతనిపై తిరగబడ్డానని, తనకు 16 ఏళ్ళు రాకముందే తమను వదిలి వెళ్లిపోయాడని ఆమె చెప్పారు.
తనకు, తల్లికి, తన ముగ్గురు సోదరులకు హాని చేస్తానని ఎన్నోసార్లు బెదిరించేవాడని ఆమె అన్నారు. అప్పట్లో పోక్సో లాంటి చట్టాలు ఉంటే తన తండ్రిపై ఫిర్యాదు చేసేదానన్నారు. ఇప్పుడు పిల్లలు తమకు కలిగిన ఇలాంటి అనుభవాలను ధైర్యంగా బయటికి చెప్పుకోవడం హర్షణీయమన్నారు. ఖుష్బూను ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది.
మనకు తెలిసినవాళ్లు, మన దగ్గరి బంధువుల్లోనే కీచకులుంటారన్న విషయాన్ని గుర్తించడం మంచిదని ఆమె పేర్కొన్నారు.