ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి, పెళ్లి పీటలెక్కేశారు. నయన్-విఘ్నేష్ శివన్, అలియా-రణ్ బీర్, హన్సిక- సోహెల్, నాగశౌర్య లాంటి సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే కొత్త ఏడాదిలో మరో బాలీవుడ్ జంట ఒక్కటవ్వడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా చెప్పుకునే కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా పార్టీలు, పబ్బులు విదేశీ పర్యటనలు అంటూ చట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది.
అయితే ఈ సారి మాత్రం ఆ ప్రచారం నిజమయ్యేలా ఉంది. వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిందట. ఫిబ్రవరి 6 న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4,5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబయిలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం మాత్రం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్ లో జరగనున్నట్టు సమాచారం.
వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు,సన్నిహితులు,పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని బీ టౌన్ లో టాక్. కాగా ఈ జంట మొదటి సారి షేర్షా సినిమాలో స్క్రీన్ పంచుకుంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ మూవీలో నటిస్తోంది. సిద్దార్థ్ ఏమో రష్మిక మందనతో నటించిన మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అందుకే వీరు ఫిబ్రవరిలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.