పాలమూరు జిల్లాలో కిడ్నాప్ ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారని.. వారి సమాచారం తెలియజేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు. విశ్వనాథ్ బండేకర్ అనే వ్యక్తిని గంజి ఏరియాలో అదుపులోకి తీసుకున్నారని.. ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.
విశ్వనాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అతని ఆచూకీ కోసం ఎంతో ప్రాథేయపడినట్లు వివరించారు బ్రహ్మచారి. ఈ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే మైత్రీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని వరద యాదయ్యను కూడా ఎత్తుకెళ్లారని చెప్పారు. వీరిద్దరితోపాటు చలవగాలి నాగరాజును కూడా కిడ్నాప్ చేశారని తెలిపారు. వీరందరూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలన నిజాం పాలనను మించిపోయిందన్నారు వీరబ్రహ్మచారి. పాలమూరులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను కొడతామని బహిరంగంగా చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని.. మల్కాజిగిరిలో ఓ మహిళా న్యాయవాదిపై కూడా దాడి జరిగిందని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
తప్పుడు అఫిడవిట్ పత్రాలతో నామినేషన్ వేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చలవగాలి రాఘవేంద్ర రాజు, విశ్వనాథ్ బండేకర్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసును వాపసు తీసుకోవాలని ఎన్నో రోజులుగా ఒత్తిడ్లు ఉన్నాయి. కోర్టులో కేసు వ్యవహారం దగ్గరకొస్తుండటంతో పాటు, ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ వ్యవహరంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈక్రమంలో రాఘవేంద్ర రాజు తమ్ముడు నాగరాజును కొందరు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. అదేరోజు రాత్రి రాఘవేంద్ర రాజు ఇంటిపైకి పోలీసులు వెళ్లి డోర్ ను ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరు కనిపించకుండా పోయారు. వారిని ఎవరు తీసుకెళ్లారని బీజేపీ నేత వీరబ్రహ్మచారి ప్రశ్నిస్తున్నారు.
ఇటు ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో మండిపడుతున్నాయి. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? అని ప్రశ్నిస్తున్నాయి.