అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోయిందని మరోసారి రుజువైంది. కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల కథ విషాదంగా ముగిసింది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ నగరంలో కిడ్నాప్ కు గురైన 8 నెలల చిన్నారి సహా భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఓ తోటలో మృతదేహాలుగా కనిపించారు.
మెర్సిడ్ కౌంటీ లోని ఓ పండ్ల తోటలో వారు విగతజీవులుగా పడి ఉన్నారని పోలీసు ఉన్నతాధికారి వెర్న్ వార్క్నే తెలిపారు. ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి సోమవారం 8 నెలల చిన్నారి అరహిధేరి, ఆమె తల్లి జస్లీన్ కౌర్ (27),తండ్రి జస్దీప్ సింగ్ (36), మేనమామను దుండగులు కిడ్నాప్ చేశారు.
అదే రోజు కుటుంబ సభ్యుల్లో ఒకరికి చెందిన కారును కాల్చివేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బాధితుడి బ్యాంకు కార్డులలో ఒకటి మెర్సిడ్ కౌంటీలోని అట్ వాటర్ ఏరియాలోని ఒక ఏటీఎం సెంటర్ లో ఉపయోగించినట్లు వెల్లడైంది.
దీనికి సంబంధించి ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్ హోషియార్‌పూర్ తాండా బ్లాక్‌లోని హర్సి పిండ్ గ్రామానికి చెందినవారు. కొడుకు, కోడలు, మనవరాలి మరణవార్త విని రణధీర్ సింగ్ బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడు జీసస్ మాన్యువల్ సల్గాడోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.