అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం కిడ్నాప్ కి గురయింది. కాలిఫోర్నియాలో 8 నెలల పసిపాపతో సహా నలుగురు కుటుంబ సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పంజాబ్ కు చెందిన 36 ఏళ్ళ జస్దీప్ సింగ్, ఆయన భార్య జస్లీన్ కౌర్ ని, బేబీ అరూహీ ధేరీతో బాటు ఆ చిన్నారి బాబాయి 39 ఏళ్ళ అమన్ దీప్ సింగ్ ని దుండగులు అపహరించుకుపోయినట్టు పోలీసులు తెలిపారు.
కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండు అందలేదన్నారు. ఈ కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు డిటెక్టివ్ లను నియమించామన్నారు. విమానాన్నికూడా రంగంలోకి దించామన్నారు. వీరి గురించిన సమాచారం తెలిసినవారెవరైనా వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
గుండుతో ఉన్న ఓ వ్యక్తి మాస్క్ ధరించి కిడ్నాప్ కి పాల్పడినట్టు అనుమానిస్తున్నామంటూ ఆ ఆవ్యక్తి ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇతడి వద్ద ఆయుధాలు ఉండవచ్చునని, ప్రమాదకరమైన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు.
ఇతని గురించిన ఆచూకీ లభిస్తే మాకు తక్షణమే తెలియజేయండి.. అతనికి దగ్గరగా పోవద్దు అని కూడా వారు సూచించారు. కాలిఫోర్నియా మెర్సిద్ కౌంటీలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జస్దీప్ తలిదండ్రులు రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్ హోషియార్ పూర్ లోని తండా బ్లాక్ ..హర్సి పిండ్ లో నివాసం ఉంటున్నారు. అమెరికాలో తమ కుటుంబ సభ్యులను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారో వారు చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం తెలిసి వారు దిగ్భ్రాంతి చెందారు. కేంద్ర మంత్రి, హోషియార్ పూర్ ఎంపీ సోమ్ ప్రకాష్..వీరిని పరామర్శించి.. అమెరికాలోని వీరి కుటుంబ రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.